తిరుమలలో జైన్ దంపతుల భారీ విరాళం
తిరుమలలో వర్ధమాన్ జైన్, రాధికా జైన్‌లతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీవారికి భారీ ఎత్తున విరాళం సమర్పించిన జైన్ దంపతులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందమని, మరెక్కడా దొరకనటువంటి దివ్యానుభూతి ఇక్కడ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
శ్రీవారికి జైన్ దంపతులు 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. దేవుని ఆదేశంతోనే ఈ విరాళం అందించామని జైన్ దంపతులు తెలిపారు. రూ.206 కోట్ల విలువైన ఈ ఆభరణాల్లో వజ్రాలు కూడా ఉన్నాయి. టీటీడీ అర్చకులు, ప్రతినిధులు ఈ కానుకలను స్వీకరించారు.
ఈ అపూర్వ ఘట్టంలో భాగస్వామి కావడం తన అదృష్టమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శ్రీవారికి ప్రతిరోజూ 120 కిలోల బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. అలనాడు శ్రీకృష్ణదేవరాయలు, పల్లవ, చోళ, చేర, పాండ్య, మైసూర్, మరాఠా రాజులు శ్రీవారికి కానుకలు సమర్పించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు అందించిన రత్నకిరీటం, పీతాంబరానికి ఎంతో చరిత్ర ఉందని, పూర్వ కాలంలో దేవాలయాల మీద దాడులు జరిగినప్పటికీ వెంకటేశ్వరస్వామి ఆలయం విషయంలో ఎవ్వరూ ఆ సాహసానికి ఒడిగట్టలేదని ఆయన వివరించారు.





