ఎల్ఐసీకి షాక్..ఏజెంట్ మోసంలో రూ.5.30 కోట్లు రిఫండ్!

ఏజెంట్ చేసిన మోసానికి ఎల్ఐసీ బాధ్యత వహించాల్సిందేనని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) తీర్పు ఇచ్చింది.
గోల్డ్‌స్టార్ డైమండ్ ప్రైవేట్ లిమిటెడ్ తన ఉద్యోగుల పాలసీల రెన్యూవల్ కోసం ఏజెంట్ చేతన్ దేశాయ్ ద్వారా రూ.7.90 కోట్లు చెల్లించింది.
పాత పాలసీలను రెన్యూవల్ చేయకుండా, సంస్థకు తెలియకుండానే ఆ డబ్బుతో ఏజెంట్ కొత్త పాలసీలు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎల్ఐసీ అంతర్గత విచారణలో కేవైసీ లోపాలు, నకిలీ పత్రాల వినియోగం బయటపడటంతో పాటు ఏజెంట్ కూడా మోసాన్ని అంగీకరించినట్లు కథనాలు చెబుతున్నాయి.
జస్టిస్ ఏపీ సాహి, సభ్యుడు భరత్‌కుమార్ పాండ్యా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
చెక్కులు ఎల్ఐసీ పేరుపైనే ఉండటం, డబ్బు సంస్థ ఖాతాల్లోనే జమై ఉండటంతో సేవా లోపానికి ఎల్ఐసీనే బాధ్యత వహించాలని కమిషన్ తేల్చి చెప్పింది.
2013 డిసెంబర్ 27 నుంచి 6 శాతం వడ్డీతో రూ.5.30 కోట్లు, రూ.లక్ష న్యాయ ఖర్చులు మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
గడువు దాటితే 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.
సంస్థ అడిగిన రూ.10 కోట్ల అదనపు పరిహారం డిమాండ్‌ను కమిషన్ తిరస్కరించింది.





