సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు
సంగారెడ్డిలో ఆకతాయిల ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
నిబంధనలు ఉల్లంఘించి మోడిఫైడ్ సైలెన్సర్లు వాడుతున్న 200 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించి, ఆ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న 200 సైలెన్సర్లను రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు.
సైలెన్సర్లు మార్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సత్యయ్య గౌడ్ హెచ్చరించారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, రూరల్ సీఐ నయీముద్దీన్, టౌన్ సీఐ రాము నాయుడు పాల్గొన్నారు.





