హైదరాబాద్‌లో రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు.. అందులో సగం వృథా!: చరణ్ కౌశిక్ యాదవ్

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ముప్పు పెరుగుతోందని, ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ కోరారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఆహార కొరత లేదని, అయితే తక్కువ వర్షపాతం కారణంగా నీటి లభ్యతపై ఆందోళన ఉందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకు సుమారు 260 కోట్ల లీటర్ల నీరు వినియోగిస్తుండగా, అందులో దాదాపు సగం వృథా అవుతోందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో సుమారు 160 కోట్ల లీటర్లు, చెన్నైలో 120 కోట్ల లీటర్ల నీటి వినియోగం ఉంటుందని పోల్చిచెప్పారు.
అలాగే కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిందని, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్ల నిల్వలు గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గినట్లు తాజా అధికారిక గణాంకాలు కూడా సూచిస్తున్నాయి.
నీటి సంక్షోభంపై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తుంటే బీఆర్ఎస్ రాజకీయ విమర్శలకే పరిమితమవుతోందని కౌశిక్ యాదవ్ ఆరోపించారు. కేంద్రం నుంచి తగిన సహాయం రావడం లేదని పేర్కొంటూ బీజేపీపైనా విమర్శలు చేశారు.





