ఢిల్లీలో అమన్ గాజీకి పోలీసులకు ఎదురుకాల్పులు.. కాలికి బుల్లెట్ గాయం

ఢిల్లీ ఉస్మాన్‌పూర్ ఏరియా పుష్తా రోడ్డులో నార్త్-ఈస్ట్ స్పెషల్ స్టాఫ్ పోలీసులకు, అమన్ గాజీకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
డీ-కంపెనీ షూటర్ నసీమ్ దుర్రానీ ప్రధాన అనుచరుడైన అమన్ గాజీ సంచరిస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా అమన్ గాజీ పోలీసులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఆత్మరక్షణ కోసం పోలీసులు ఐదు రౌండ్లు ఎదురుకాల్పులు జరపడంతో అమన్ గాజీ కాలికి బుల్లెట్ గాయమైంది.
గాయపడిన అమన్ గాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
గతంలో ఢిల్లీకి చెందిన కపిల్ మిశ్రా ఆఫీసు బయట జరిగిన కాల్పుల కేసులో అమన్ గాజీ కీలక నిందితుడు.
నసీమ్ దుర్రానీతో కలిసి కపిల్ మిశ్రా ఆఫీసు దగ్గర కాల్పులకు తెగబడినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ.
చికిత్స అనంతరం అమన్ గాజీని విచారించి మరిన్ని నేరాల చిట్టా బయటపెట్టేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.





