సెమీకండక్టర్ల తయారీకి ఏపీ భారీ ఆఫర్.. తిరుపతిలో 5 వేల ఎకరాల్లో పార్క్

భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సెమికాన్ 2.0కి అనుగుణంగా సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0ను సవరిస్తూ నవంబర్ 16న జీవో నంబర్ 87ను జారీ చేసింది.
సవరించిన విధానం ప్రకారం సిలికాన్ ఫ్యాబ్‌ల కోసం కేంద్రం ఇచ్చే మూలధన సాయానికి వంద శాతం సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది. సెమికాన్ 2.0 కింద ఆమోదం పొందిన సిలికాన్ ఫ్యాబ్‌లకు ఏకంగా 80 శాతం రాయితీ లభిస్తుంది. ఇందులో కేంద్రం 40 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తాయి. కాంపౌండ్ సెమీకండక్టర్, ఫోటోనిక్స్, సెన్సార్, డిస్‌ప్లే ఫ్యాబ్‌లతో పాటు అధునాతన ప్యాకేజింగ్ రంగానికి 70 శాతం, లెగసీ ప్యాకేజింగ్‌కు 50 శాతం మూలధన రాయితీ ఇవ్వనున్నారు.
దేశంలో అత్యధిక రాయితీలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఒడిశా, తమిళనాడు (65 శాతం), ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ (60 శాతం), గుజరాత్ (56 శాతం) కన్నా ఏపీ ఆఫర్ చేస్తున్న రాయితీ చాలా ఎక్కువ. డిజైన్ నుంచి ప్యాకేజింగ్ వరకు చిప్ తయారీకి ఏపీని కేంద్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కేంద్రంతో సమానంగా సాయం అందించడం ద్వారా ఫ్యాబ్ నిర్మాణాన్ని సులభతరం చేస్తున్నామన్నారు.
పరిశ్రమల కోసం తిరుపతిలో సుమారు 5,000 ఎకరాల్లో ఏపీ సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే ఈ క్లస్టర్‌లో పరిశ్రమలకు అవసరమైన భూమి, క్లీన్‌రూమ్‌లు, నాణ్యమైన కరెంటు, నీరు, కెమికల్స్, టెస్టింగ్ ల్యాబ్‌లు కల్పిస్తారు. ప్రాజెక్టులకు అనుమతులు, పరిశీలన కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏపీ సెమీకండక్టర్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (APSGIC) సింగిల్ విండో విధానంలో పని చేస్తుంది.
పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి కోసం ఐఐటీ తిరుపతిలో ఏపీ సెమీకండక్టర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (AP-SRIC), పార్కులో ఏపీ సెమీకండక్టర్ ట్రైనింగ్ సెంటర్ (AP-STCC) ఏర్పాటు కానున్నాయి. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఆరు నెలల పాటు ఒక్కో అభ్యర్థికి నెలకు రూ. 10 వేల చొప్పున శిక్షణ రాయితీ ఇస్తారు. అలాగే డిజైన్ స్టార్టప్‌లకు రూ. 22.5 కోట్ల వరకు సీడ్ ఫండింగ్ అందిస్తారు.
రూ. 1,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లు, ఆ పైబడిన పెట్టుబడులకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రత్యేక ప్యాకేజీలను ఆమోదిస్తుంది. సెమికాన్ 2.0 పరిధిలోకి రాని ప్రాజెక్టులకు ఐదేళ్ల పాటు యూనిట్‌కు రూ. 3 చొప్పున కరెంటు సబ్సిడీ వర్తిస్తుంది. దేశీయంగా చిప్ ఉత్పత్తిలో అతిపెద్ద వాటాను దక్కించుకోవడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని సిద్ధం చేసింది.





