కరోనా వేళ ప్రాణాల కోసం పోరాడిన రోగుల నుంచి కూడా లంచాలా?.. నిమ్స్ అక్రమాల కేసులో సంచలన ఆరోపణలు!

కరోనా మహమ్మారి సమయంలో ఒక్క ఆసుపత్రి బెడ్ దొరికితే చాలు.. తమవారి ప్రాణాలు నిలబడతాయని కుటుంబాలు కన్నీళ్లతో ఎదురుచూసిన రోజులు అవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నిమ్స్‌లో బెడ్ల కేటాయింపునకు లక్ష రూపాయల వరకు లంచాలు వసూలు చేసినట్లు ఏసీబీ విచారణలో ఆరోపణలు వెలుగుచూశాయి.
నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్, ప్రశాంత్‌తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. సుగుణమ్మ అనే మహిళ నుంచి బెడ్ కేటాయింపు కోసం రూ.లక్ష తీసుకున్నట్లు ఆరోపణలు ఉండగా, ఆసుపత్రి రికార్డుల్లో కేవలం రూ.వెయ్యి మాత్రమే చెల్లించినట్లు చూపినట్లు విచారణలో వెల్లడైంది.
నిమ్స్ ఉద్యోగి కాని ప్రశాంత్ బెడ్ల కేటాయింపులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్యాంటీన్లు, మెడికల్ షాపులు, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.
ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు అల్లాడిన కరోనా సమయంలోనూ ఇలాంటి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.





