వెంటిలెటర్ల దొంగలు దొరికారు

రిమ్స్‌లో రూ.32 లక్షల విలువైన వెంటిలేటర్ల చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
రోగికి శ్వాస అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటిలేటర్ ఓ ప్రాణరక్షక సాధనం. అలాంటి అత్యవసర వైద్య పరికరాలపైనే దొంగలు కన్నేశారు. వైద్య సిబ్బందిలా, టెక్నీషియన్ల ముసుగులో ఆసుపత్రుల్లోకి ప్రవేశించి.. రోగులకు చికిత్స అందిస్తున్న వెంటిలేటర్లనే ఎత్తుకెళ్లారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వైద్య వర్గాల్లో కలకలం రేపింది. ఏకంగా రూ.32 లక్షల విలువైన నాలుగు వెంటిలేటర్లను అపహరించిన అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన పరికరాలను కొనుగోలు చేస్తున్న వ్యక్తితో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేసి, భారీగా వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
టెక్నీషియన్ల ముసుగులో చోరీ..
గత నెల 30న మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన సజ్జన్ బసంత్ మోతే, అభిజిత్ అనే ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్ల అవతారమెత్తారు. ఎలాంటి అనుమానం రాకుండా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించారు. రెండో అంతస్తులోని ఆర్‌ఐసీయూ, సారీ, చెస్ట్ వార్డుల్లో రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఉపయోగించే మైండ్‌రే కంపెనీకి చెందిన నాలుగు వెంటిలేటర్లను లక్ష్యంగా చేసుకున్నారు. పనిచేస్తున్న పరికరాలనే చాకచక్యంగా అపహరించి మహారాష్ట్రకు తరలించారు. రోగుల ప్రాణాలకు కీలకమైన వైద్య పరికరాలను ఎత్తుకెళ్లడం ఈ ముఠా దుర్మార్గానికి నిదర్శనంగా నిలిచింది.
చోరీ సొత్తుకు హైదరాబాద్‌లో కొనుగోలుదారు..
దొంగిలించిన వైద్య పరికరాలను విక్రయించేందుకు నిందితులు హైదరాబాద్‌కు చెందిన మెడికల్ ఎక్విప్‌మెంట్ సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారి కొండా రెడ్డిని సంప్రదించారు. అవి చోరీ చేసిన వస్తువులని తెలిసినప్పటికీ కొనుగోలు చేసేందుకు అతడు అంగీకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో చంద్రపూర్‌కు వెళ్లిన కొండా రెడ్డి.. వైద్య పరికరాలను కారులో పెట్టుకుని హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయం సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులను గమనించిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో చోరీల వెనుక ఉన్న అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఒక్క రిమ్స్‌కే పరిమితం కాని చోరీలు..
విచారణలో ఈ ముఠా గతంలోనూ పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలను చోరీ చేసినట్లు తేలింది. మహారాష్ట్రలోని నాగ్‌భీడ్, వని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలోనూ ఇదే తరహాలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో అపహరించిన వైద్య పరికరాలను హైదరాబాద్‌కు చెందిన కొనుగోలుదారుడికి విక్రయించినట్లు వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారం కేవలం రిమ్స్ చోరీకే పరిమితం కాకుండా అంతర్రాష్ట్ర స్థాయిలో సాగినట్లు స్పష్టమైంది.
భారీగా వైద్య పరికరాల రికవరీ..





