సూర్యఘర్ లబ్ధిదారులకు బ్యాంకుల కొర్రీలు.. సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్

హైదరాబాద్
ఎండల తీవ్రతతో ఇళ్లలో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగి విద్యుత్ బిల్లులు మండిపోతున్నాయి. ఈ కరెంటు కష్టాల నుంచి గట్టెక్కేందుకు సామాన్యులు సోలార్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని బిల్లుల భారం తగ్గించుకోవాలని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం కింద దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఒక కిలోవాట్ నుంచి మూడు కిలోవాట్లు, ఆపై సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది. మూడు కిలోవాట్ల వరకు గరిష్ఠంగా రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది. నెట్ మీటరింగ్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందడంతో పాటు మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందే వెసులుబాటు కూడా ఉంది.
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 1,07,903 దరఖాస్తులు అందగా, 73,135 ఇళ్లపై ప్యానెళ్లను విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే 8,500 వరకు దరఖాస్తులు రాగా, అందులో 5,900 వరకు యూనిట్లను బిగించారు.
అయితే సామాన్యులకు మేలు చేసే ఈ పథకానికి బ్యాంకుల నిబంధనలు అడ్డుకట్ట వేస్తున్నాయి. సోలార్ యూనిట్ ఏర్పాటు కోసం లబ్ధిదారులు తమ వాటా చెల్లించేందుకు లోన్ కోసం వెళ్తుంటే అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. దరఖాస్తుదారుడికి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందనే కారణంతో రుణాలు ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారు. సిబిల్ స్కోర్ బాగున్న వారిని సైతం క్షేత్రస్థాయి పరిశీలనల పేరుతో నెలల తరబడి బ్యాంకులకు తిప్పుకుంటున్నారు.
లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చని, కానీ అర్హత ఉండి కూడా ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయాలని రెడ్కో అధికారులు సూచిస్తున్నారు. సూర్యఘర్ పథకం ఉద్దేశం మంచిదే అయినా బ్యాంకుల కొర్రీలతో ఆశయం నీరుగారుతోంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రుణాల మంజూరు ప్రక్రియను సులభతరం చేయకపోతే సామాన్యులకు నిరాశే మిగులుతుంది.





