పాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.
ఆన్‌లైన్ పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పే ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకుని ఓ యువకుడి నుంచి ఏకంగా రూ.18 లక్షలు వసూలు చేశాడు ఓ కేటుగాడు. యువకుడి బలహీనతలను ఆసరాగా చేసుకుని విడతల వారీగా డబ్బులు గుంజాడు. చివరకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం డబ్బులతో పాటు, గ్రామంలో అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించాడు బాధితుడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జడ్చర్ల పోలీసులు.. ఈ వ్యవహారం వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు లింక్‌ను గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
గే డేటింగ్ యాప్... ఆన్‌లైన్ పరిచయం... నమ్మకంగా మొదలైన వ్యవహారం చివరకు భారీ మోసానికి దారితీసింది. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలంగా ఆన్‌లైన్‌లో మాట్లాడుకుంటూ యువకుడికి దగ్గరయ్యాడు. అతడి వ్యక్తిగత విషయాలు, బలహీనతలను తెలుసుకుని వాటినే మోసానికి అవకాశంగా మలుచుకున్నాడు. ఆ తర్వాత వివిధ కారణాలు చెబుతూ విడతల వారీగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న మొత్తాలతో మొదలైన వసూళ్లు.. క్రమంగా లక్షల్లోకి చేరాయి. నిందితుడి మాటలు నమ్మిన యువకుడు అడిగినప్పుడల్లా డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు. ఇటీవల ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం డబ్బులను సైతం చెల్లించాడు. అవి సరిపోకపోవడంతో గ్రామంలో తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చాడు. ఇలా మొత్తంగా సుమారు రూ.18 లక్షలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అప్పులతో చేయడంతో కుటుంబ సభ్యులకు అనుమానం:
అయితే యువకుడు భారీగా డబ్బులు అప్పులు చేయడం కుటుంబ సభ్యులకు తెలియడంతో అసలు వ్యవహారం బయటపడింది. బాధితుడి కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడితో జరిగిన ఆన్‌లైన్ సంభాషణలు, డబ్బుల లావాదేవీల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో మోసం వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మోసం ఒక్క యువకుడికే పరిమితం కాలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది మంది యువకులను లక్ష్యంగా చేసుకుని ఇదే తరహాలో మోసాలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి ఆన్‌లైన్ పరిచయాలు, బ్యాంకు లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మరికొందరు బాధితులు ఉన్నారా...? మరెంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు...? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.





