తెలంగాణలో మందుబాబుల జోరు.. దేశంలో పురుషుల మద్యం వినియోగంలో రాష్ట్రమే టాప్

హైదరాబాద్
తెలంగాణలో మద్యం వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పురుషులతో పాటు మహిళల్లోనూ ఈ అలవాటు అధికమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఆల్కహాల్ వాడకం దేశంలోనే అత్యధిక స్థాయిలో ఉంది. ఒకవైపు మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నా ఆరోగ్యపరంగా తలెత్తుతున్న సమస్యలు తీవ్రమవుతున్నాయి.
సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఏకంగా 43.9 శాతం మంది మద్యం తాగుతున్నారు. దేశ సగటు 18.9 శాతంగా ఉంటే తెలంగాణలో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. పురుషుల మద్యం వాడకంలో 42.2 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలవగా.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాల (36.3 శాతం) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (46.6 శాతం) మందుబాబులు ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
మహిళల్లోనూ మద్యం వినియోగం జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలో 7.1 శాతం మంది మహిళలు ఆల్కహాల్ తీసుకుంటూ దేశంలో రాజస్థాన్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో 8.6 శాతం, పట్టణాల్లో 2.8 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, భావోద్వేగాలను తట్టుకోలేక చాలా మంది మహిళలు మద్యం వైపు మొగ్గుచూపుతున్నారని ఉమెన్స్ హెల్త్ కౌన్సిలర్ అస్ఫార్ జహాన్ తెలిపారు.
మద్యం అమ్మకాల పరంగానూ తెలంగాణ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 372.25 లక్షల కేసుల మద్యం అమ్ముడవగా.. 2025-26 నాటికి అది 10.66 లక్షల కేసులు పెరిగి 382.91 లక్షల కేసులకు చేరింది. మార్కెట్ ఆదాయం రూ.37,487 కోట్ల నుంచి రూ.40,209 కోట్లకు పెరిగింది. కస్టమర్లకు బ్రాండ్లు సులభంగా అందుబాటులో ఉండటమే అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలంగాణ వైన్స్ అసోసియేషన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు చెప్పారు. పెరిగిన ఈ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వాడాలని ఆర్థిక నిపుణుడు పాపారావు సూచించారు.
సరదాగా మొదలయ్యే మద్యం అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుందని డీ-అడిక్షన్ నిపుణుడు డాక్టర్ గిడియోన్ హెచ్చరించారు. మద్యం లేకుండా రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి వస్తే అది డిపెండెన్సీకి సంకేతమని స్పష్టం చేశారు. ఈ అలవాటును దాచిపెట్టి సమర్థించుకోవడం కంటే సమస్యను గుర్తించి వెంటనే నిపుణుల సాయం తీసుకోవడం ఉత్తమమని సూచించారు.





