ఏపీలో పెట్టుబడుల హోరు తొలిరోజే రూ.5.84 లక్షల కోట్ల ఒప్పందాలు

విశాఖపట్నం
రాష్ట్రంలో పెట్టుబడుల పర్వం మొదలైంది. సదస్సులో తొలి రోజే రూ.5,84,355 కోట్ల విలువైన 73 ఎంఓయూలు, 15 జీవోల మార్పిడి జరిగింది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 1,07,693 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
ఈ భారీ పెట్టుబడుల్లో సగానికి పైగా వాటా రిలయన్స్ సంస్థదే కావడం గమనార్హం. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు కోసం రిలయన్స్ ఏకంగా రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. దీని తర్వాత గ్రీన్ కో రూ.45 వేల కోట్లు, క్లీన్ మ్యాక్స్ రూ.41 వేల కోట్లు, మేఘా రూ.36 వేల కోట్లతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.
కియా మోటార్స్ రూ.18,878 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల 12 వేల మందికి ఉపాధి దక్కనుంది. రష్మీ మెటలర్జికల్ రూ.18,500 కోట్లు, జేఎస్డబ్ల్యూ రూ.15 వేల కోట్లు, వారీ సంస్థ రూ.15 వేల కోట్లు, గెయిల్ రూ.13,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. రంగాల వారీగా చూస్తే జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ అత్యధికంగా రూ.3.57 లక్షల కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.1.65 లక్షల కోట్లను ఆకర్షించాయి. అంతరిక్ష రంగానికి చెందిన ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ సంస్థ తిమ్మసముద్రంలోని తమ రాకెట్ టెస్టింగ్ కేంద్రాన్ని విస్తరించేందుకు రూ.800 కోట్లతో ముందుకొచ్చింది.
రూ.22 వేల కోట్లకు పైగా నిధులతో పోర్టుల విస్తరణ, దుగరాజపట్నంలో రూ.29 వేల కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ పనుల ప్రణాళికలను మంత్రులు వివరించారు. ఇదే వేదికపై నేపాల్, జపాన్ జేఆర్ఐ, శ్రీలంక, రష్యా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రష్యా పరిశ్రమల ప్రతినిధులకు ఏపీలోని రేర్ ఎర్త్ కారిడార్ విశేషాలను లోకేష్ వివరించారు. రెండేళ్లలో స్వదేశీ పౌర విమానాన్ని ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇండియా, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం డిసెంబర్ 16న బ్రస్సెల్స్లో ఖరారు కానుందని ఈయూ అంబాసిడర్ వెల్లడించారు.
సదస్సు రెండో రోజు ఉదయం 9:45 గంటలకు ఐఅండ్పీఆర్ లైవ్ స్ట్రీమ్ మొదలవుతుంది. ఉదయం 11 గంటల నుంచి ముఖ్యమంత్రితో ఫైర్ సైడ్ చాట్, మధ్యాహ్నం 12:15 నుంచి ఏఐ, క్వాంటం రంగాలపై సెషన్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 3:45 గంటలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరై సదస్సును ముగిస్తారు. కాగా గత జూన్ నుంచి ఇప్పటివరకు రూ.7.1 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయని అధికారిక ప్రకటన స్పష్టం చేసింది.





