బెంగళూరులో మహిళపై వేధింపులు.. కడుగోడి పోలీసుల కేసు నమోదు
బెంగళూరులో తనను వేధించిన వ్యక్తిపై బాధితురాలు కడుగోడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కడుగోడి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఈ అప్‌డేట్ ఇచ్చారు. తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని పోలి ఉన్న కొందరిని గుర్తించారు. పూర్తిస్థాయిలో ధృవీకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తన మునుపటి వీడియోను వైరల్ చేసిన ప్రతి ఒక్కరికీ బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. తాను సురక్షితంగా ఉన్నానని స్పష్టం చేశారు. వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా, మౌనంగా ఉండకుండా నిందితులను ఎదుర్కోవాలని లేదా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని ఆమె ఇతర మహిళలను కోరారు.





