అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ

అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ
47 అంతస్తులు.. 206 మీటర్ల ఎత్తుతో T1, T2 టవర్ల నిర్మాణం
11 ఎకరాల్లో 37.48 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు
ట్విన్ టవర్స్ అందుబాటులోకి వస్తే 25 వేల మందికి ఉపాధి
క్వాంటం వ్యాలీలో మొత్తం 8 టవర్ల నిర్మాణం
రక్షణ, వైద్యం, బ్యాంకింగ్, ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణలో క్వాంటం కంప్యూటింగ్ కీలకం: మంత్రి నారాయణ
అమరావతి:* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మరో కీలక అడుగు పడింది. ఉద్దండరాయునిపాలెంలోని క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్స్ (T1, T2) నిర్మాణానికి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే 11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ రెండు టవర్లు అమరావతికి తలమానికంగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.క్వాంటం వ్యాలీలోని మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో భాగంగా 11 ఎకరాల్లో ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టనున్నారు. T1, T2 టవర్లను ఒక్కొక్కటి 47 అంతస్తులతో, 206 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. ఈ రెండు టవర్లలో కలిపి మొత్తం 37,48,847 చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణం ఉండనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు అవసరమైన సదుపాయాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఆధునిక కార్యాలయ ప్రాంగణాలను (రెడీ టు ఫ్యూచర్ వర్క్ స్పేస్‌లు) ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
క్వాంటం వ్యాలీలో మొత్తం 8 టవర్లు
క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో మొత్తం ఎనిమిది టవర్లను నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తాజాగా శంకుస్థాపన చేసిన ట్విన్ టవర్స్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సుమారు 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు.
అనేక రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ కీలకం
సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే క్వాంటం కంప్యూటింగ్‌కు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఒక సమస్యకు సంబంధించి బహుళ అవకాశాలను ఏకకాలంలో పరిగణనలోకి తీసుకుని గణనలను నిర్వహించడం క్వాంటం కంప్యూటింగ్‌లోని ముఖ్యమైన ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఈ సాంకేతికత రక్షణ, వైద్యం, బ్యాంకింగ్‌తో పాటు ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని అంచనా వేయడం, వాటివల్ల కలిగే నష్టాలను తగ్గించే పరిష్కారాల రూపకల్పన వంటి కీలక రంగాల్లో ఉపయోగపడుతుందని తెలిపారు.
నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తి చేస్తాం
క్వాంటం వ్యాలీలో నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అమరావతిలో ఈ నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు





