తిరుమల శ్రీవారి అద్భుత చిత్రాన్ని గీసిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపాన్ని మొదటిసారిగా అద్భుతంగా గీసిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ (86) గారు కన్నుమూశారు. వయసు మీద పడటం, అనారోగ్య సమస్యల వల్ల ఆయన తమిళనాడులోని తన సొంత ఇంట్లో తుదిశ్వాస విడిచారు.
1970వ దశకంలో స్వామివారిని చూసి బొమ్మ గీసేందుకు దేవస్థానం వారు అవకాశం ఇవ్వడంతో ఆయన తిరుమల వెళ్లారు. అయితే అప్పట్లో ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో గర్భగుడిలోకి వెళ్లలేకపోయారు. దాంతో కాస్త దూరం నుంచే స్వామివారిని చూస్తూ ముందుగా ఎలాంటి నగలు లేకుండా, ఆ తర్వాత నగలతో అలంకరించిన స్వామివారి రూపాన్ని ప్రాణం ఉట్టిపడేలా గీశారు.
ఆయన గీసిన బొమ్మకు దేవస్థానం వారు అంగీకారం తెలపడంతో, శివకాశి ప్రింటింగ్ ప్రెస్ వారు వాటిని క్యాలెండర్లుగా, ఫోటోలుగా ముద్రించారు. ఆ ఫోటోలకు భక్తుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ పూజిస్తున్న శ్రీవారి ఫోటోను గీసింది ఈయనే కావడం విశేషం.





