🚨 శ్రీవారి నెయ్యి కల్తీ కేసులో ఈడీ భారీ

చర్య.. రూ.129.85 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్!
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం రూ.129.85 కోట్ల చర, స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది.
భోలే బాబా ఆర్గానిక్ డెయిరీమిల్క్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, సుకృతి ఫుడ్స్ సంస్థలు, వాటి ప్రమోటర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, కైలాష్ చంద్ మంగ్లా, వారి కుటుంబ సభ్యులు, ఇతర సంబంధిత సంస్థలు–వ్యక్తుల ఆస్తులు ఇందులో ఉన్నాయి.
రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ పేర్కొంది. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్కు రసాయనాలు కలిపి నెయ్యిగా తయారు చేశారన్నది దర్యాప్తు సంస్థ ఆరోపణ.
నకిలీ కొనుగోలు లావాదేవీలు, హవాలా మార్గాల్లో నగదు చెల్లింపులతో ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చినట్లు ఈడీ తెలిపింది.
గతంలో స్వాధీనం, ఫ్రీజ్ చేసిన రూ.2.70 కోట్లతో కలిపి.. ఈ కేసులో ఇప్పటివరకు చర్యలు తీసుకున్న ఆస్తుల మొత్తం రూ.132.55 కోట్లకు చేరింది. దర్యాప్తు కొనసాగుతోంది.





