ఐఎస్ సదన్ పోలీసుల చర్య.. సీపీఆర్‌తో 28 ఏళ్ల యువకుడికి పునర్జన్మ
హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ ప్రాంతంలో 28 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో అతడి గుండె స్పందన ఆగిపోయింది.
అక్కడ విధుల్లో ఉన్న ఐఎస్ సదన్ బ్లూ కోల్ట్స్ కానిస్టేబుళ్లు దీపక్ కుమార్, కె. సాయిబాబా పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు.
యువకుడిని అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించే క్రమంలోనే కానిస్టేబుళ్లు సీపీఆర్ చేశారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ సీపీఆర్ చేస్తూ, అంబులెన్స్ లేదా వాహనం కోసం వెంటనే పిలవాలని అక్కడున్న వారిని కోరారు. అలాగే యువకుడు శ్వాస తీసుకుంటున్నాడా లేదా స్పృహలోకి వస్తున్నాడా అని పరీక్షించారు. సకాలంలో అందించిన సీపీఆర్‌తో యువకుడి గుండె మళ్లీ స్పందించింది.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం.. ఇద్దరు కానిస్టేబుళ్ల సమయస్ఫూర్తి ఓ కుటుంబంలో చీకటి నింపకుండా చేసింది.





