సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

అసమర్థుడికి అధికారం అప్పగిస్తే.. ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా ఉంది రేవంత్ పాలన!
కరువు రాగానే చేతులెత్తేసిన చేతగాని సీఎంగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతాడు.
రంకెలు వేసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు రేవంత్ రెడ్డి
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ చేతగానితనం వల్ల వచ్చిన కరువే
మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే.
రైతులకు, ప్రజలకు భరోసా ఇవ్వడం మానేసి భయభ్రాంతులకు గురిచేస్తావా రేవంత్ రెడ్డి?
కరువు వస్తోంది.. నేనేం చేయలేనని చేతులెత్తేసేవాడా పాలకుడు?
తాగునీళ్లు కూడా ఉండవని భయపెట్టడానికేనా రేవంత్‌కు సీఎం పదవి ఉన్నది?
ప్రజలను కాపాడేందుకు ఎంతకైనా సిద్ధమనేవాడే కదా నిజమైన పాలకుడు?
ఇప్పుడు కేసీఆర్ సీఎంగా ఉంటే.. రేవంత్‌లాగా పనికిమాలిన, చేతగాని మాటలు చెప్పేవారా?
వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఒడిసిపట్టి.. తెలంగాణకు కరువు రాకుండా కేసీఆర్ చూసేవారు.
ముందస్తు చర్యలు తీసుకొని కరెంటు కోతలు నివారించేవారు.
ఎల్‌నినో గురించి ఆరు నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెబుతున్న మీరు.. ఈ ఆరు నెలల్లో కరువు నివారణకు తీసుకున్న ముందస్తు చర్యలేంటో చెప్పగలరా రేవంత్ రెడ్డి?
కరువు ప్రకృతి సృష్టి కావచ్చు.. కానీ కరువును ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించడం, ప్రజలకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా?
ప్రజలను భయపెట్టడం కాదు.. భరోసా ఇవ్వాలి. నీటి నిల్వలు, విద్యుత్, ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై మీ కార్యాచరణ ఏంటి?
కరువు వస్తుందని ఆరు నెలలుగా తెలుసని చెబుతున్నారు.. మరి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోలేదు? ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఎందుకు పెంచుకోలేదు?
బొగ్గు నిల్వలు లేవు, కరెంట్ సంక్షోభం వస్తుందని మేం మొత్తుకుంటుంటే.. ఎందుకు ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారు?
ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు మీ చేతగానితనం కారణం కాదా? ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు?
ఎల్‌నినో ప్రపంచవ్యాప్త సమస్య అయితే.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు కరువు లేదు? అక్కడ ఎందుకు నీటి గలగలలు.. ఇక్కడ ఎందుకు రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి?
కరువు పేరుతో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేమని ముందే చేతులెత్తేయడం పాలనా దక్షత కాదు.. రైతులను సంక్షోభంలోకి నెట్టడమే!
20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగాన్ని గొప్పగా చెబుతున్నారు.. అదే సమయంలో విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటున్న రైతుల గోస కనిపించడం లేదా?
బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. దాన్ని కూడా తన ఘనతగా చెప్పుకునే భావదారిద్ర్యం రేవంత్ రెడ్డిది.
ఇలాంటి వ్యక్తి కరువు నుండి ప్రజలను కాపాడతారా ప్రజలు ఆలోచించాలి.
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే రాజకీయ విమర్శలు.. ఇదేనా మీ ప్రజాపాలన?





